యూరియా కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ప్రశాంతి రెడ్డి

  • కాకాని, నల్లపురెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ప్రశాంతి రెడ్డి
  • నెల్లూరు జిల్లాలో యూరియా కొరత లేదని వెల్లడి
  • విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్న కోవూరు ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లాలో వర్షాకాలం ప్రారంభమై రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్న వేళ యూరియా కొరత, ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ జరుగుతున్న ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తీవ్రంగా స్పందించారు. యూరియా కొరత ఉందంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలపై ప్రశాంతి రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతులను తప్పుదారి పట్టించేలా యూరియా లభ్యతపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని, రైతుల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రైతులు వదంతులను నమ్మకుండా అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచిందని తెలిపారు.

అలాగే కోవూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డిలను ఉద్దేశించి కూడా ఆమె విమర్శలు చేశారు. వారు అక్కడికి పేరంటానికి వెళ్లినట్టు వెళ్లారని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన నాయకులు రాజకీయ విమర్శలకు పరిమితమవుతున్నారని ప్రశాంతి రెడ్డి అన్నారు. యూరియా కొరతపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Prashanthi Reddy
Nellore urea shortage
Kakani Govardhan Reddy
Nallapureddy Prasanna Kumar Reddy
Andhra Pradesh agriculture news
TDP MLA Nellore

More Telugu News